తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షపార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదు అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్ తేల్చిచెప్పారు. సభలో ఎవరు అరాచకం చేస్తున్నారో స్పష్టంగా కనబడుతుందని కేసీఆర్ సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని, దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని సూచించారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదు అని విపక్ష సభ్యులను కేసీఆర్ హెచ్చరించారు. ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనేది కాంగ్రెస్ సభ్యుల గొడవని అందుకే అరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. దీనిపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడియం వద్దకు దూసుకెళ్లారు. సభలో ప్రతిపక్షాన్ని లేకుండా చూడాలని సీఎం ప్రయత్నిస్తున్నాంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. అనంతరం కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..కాంగ్రెస్ సభ్యుల అసత్య ఆరోపణలను ఆపడానికే వారిని సభ నుంచి సస్పెండ్ చేశామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుకార్చే ప్రయత్నం చేసిందని, ఉద్యమకారులపై కేసుల పెట్టిన చరిత్ర ఆ పార్టీ అని నిప్పులు చెరిగారు. అన్ని పార్టీలను ఏకంచేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలంతా టీఆర్‌ఎస్ పక్షానే నిలుస్తున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతుందో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం హితవుపలికారు.