తెలంగాణ అసెంబ్లీలో నిరుద్యోగ భృతి,ఇంటింటికి ఉద్యోగం పై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. “తెలంగాణలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఏనాడు చెప్పలేదు. నాకు అంతా గుర్తే ఉంది. ప్రతి సభలో కూడా ఘంటాపథంగా నేను చెప్పినా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రా ఉద్యోగులు వెళ్లి పోతారు కాబట్టి వారితో మనకు పోటి ఉండదు. అప్పుడు మన ఉద్యోగాలు మన వాళ్లకే దక్కుతాయి అని అన్నాను. కానీ ఏనాడు కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తామనలేదు. అసలు అది సాధ్యమయ్యే పనేనా. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి?
ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలకు ధీటుగా ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. కేవలం ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 15 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తున్నారు. టీడీపీ,కాంగ్రెస్ హయాంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారండి. గత ఐదు సంవత్సరాలలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామో మీకు తెలియదా. లెక్కలు చూడండి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు పోతున్నాం. అన్ని కుదిరితే వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం.
ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నిరుద్యోగితను తగ్గించడమే మా లక్ష్యం. అందులో ఎటువంటి అనుమానం లేదు. డంబాచారం లేదు. ఓ మాట చెప్పి..ఇంకొటి చెప్పటం మాకు రాదు. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అమలుకు ఐదు సంవత్సరాల కాలం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఉంది. నిధుల కొరత దృష్ట్యా నిరుద్యోగ భృతి ఈ ఏడాది ఉండదు.” అని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. నిరుద్యోగులు ఉద్యోగాల పైనా,భృతి పైనా ఆశ పెట్టుకోవద్దని సీఎం చెప్పకనే చెప్పారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.