హైదరాబాద్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ రూపకల్పన జరిగిందని వివంచారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని స్పష్టం చేశారు. ‘‘ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమనేత కేసీఆర్. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతోంది. కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్. అని వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
పెట్టుబడి వ్యయం రూ.22,061.18
రెవెన్యూ మిగులు రూ.4,482.18 కోట్లు
ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు
ఆర్థిక మాంద్యం ప్రభావం, రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది.2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.3,731 కోట్లు తగ్గింది.కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం, నిధులు సకాలంలో రావట్లేదు.
2018-19లో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 16.1శాతం.కేంద్రం అరకొరగా నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 6.3శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా2.437శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,384 కోట్లు తగ్గాయి. ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందించి రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రయత్నాలు. ఈ మార్చినెలాఖరు వరకు రూ.లక్షా36వేల కోట్లు వ్యయం చేస్తాం.ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నాం.రైతు బంధు కోసం బడ్జెట్‌లో రూ.14వేల కోట్లు కేటాయింపునకు ప్రతిపాదన. కొత్త పాసుపుస్తకాల మంజూరు వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతోంది. పెరిగిన లబ్ధిదారులకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు అదనపు కేటాయింపులు. రైతు ఏకారణంతో మృతి చెందినా పది రోజుల్లోనే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షల పరిహారం అందిస్తున్నాం. రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయింపు.రైతులకు 2014లో రూ.16,124 కోట్లు రుణమాఫీ చేశాం. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టాం. రూ.25వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది. రూ.25వేల లోపు రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ చేస్తాం. దీనికోసం ఈనెలలో రూ.1,198 కోట్లు విడుదల చేస్తాం. రుణమాఫీ మొత్తాన్ని ప్రతీరైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతులమీదుగా అందిస్తాం. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం. పంటల ఉత్పత్తిలో 23.7శాతం, పాడిపశువుల రంగంలో 17.3శాతం సాధించాం.