జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు.
ఈసారి వైరస్ ఉధృతి కాస్త తగ్గడంతో ప్రభుత్వం మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రతి ఏటా ఆషాఢమాసం చివరి వారంలో పాతబస్తీలో బోనాల వేడుకలు జరుగనుండగా.. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అలాగే అమ్మవారి ఊరేగింపు జరిగే 19 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన బలిగంప పూజతో సింహవాహిని అమ్మవారి జాతర ప్రారంభమైంది.
తెల్లవారుజామున అభిషేకం నిర్వహించగా.. అలంకరణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో సోమవారం రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ తొలి బోనం సమర్పించారు. చందూలాల్ బేలలోని మాతేశ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ, ఉప్పుగూడ, చంద్రాయణగుట్ట, మీరాలం మండి, గౌలిగూడ ప్రాంతాల్లోని ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.