తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బైపోల్ ముందు మంత్రిమండలి భేటీ కానుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రగతి భవన్‌లో 2021, ఆగస్టు 01వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీకానున్న కేబినేట్.. ప్రధానంగా దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చ జరగనుంది. హుజూరాబాద్ అభివృద్ధిపైనా మంత్రివర్గం సమీక్షించనుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్‌పైనా సమావేశంలో చర్చించనున్నారు. ఇక కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న నేపథ్యంలో….. ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనుంది కేబినెట్. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధుని అర్హులైన వారికి అందించాలని భావిస్తోంది ప్రభుత్వం. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి తేదీలను ఖరారు చేయనుంది. ఇప్పటికే ఎంత మంది అర్హులున్నారు? దళితవాడల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే దానిపై అధికారులు పూర్తిస్థాయిలో లెక్కలు సేకరించారు. దానిపై కేబినేట్‌లో చర్చించనున్నారు. దళిత బీమా, చేనేత బీమాలపై కూడా ఈ కేబినేట్ సమావేశంలో చర్చించనున్నారు.
ఇటు తెలంగాణలో 50వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఆ ప్రతిపాదనను కేబినేట్ ముందు పెట్టనుంది. గత కేబినెట్‌లో శాఖల వారీగా ఉన్న ఖాళీల లెక్కల్లో గందరగోళం ఉండటంతో.. మరోసారి కేబినెట్‌కు ఆ వివరాలను అందించనుంది ఆర్థికశాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై కూడా కేబినేట్ చర్చించనుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేయడంతో పాటు పంటలకు సాగునీరు ఇచ్చే అంశంపై చర్చలు జరగనున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై మంత్రులు చర్చించనున్నారు.