మాటలను మంత్రంగా వాడాడు...ఆపై నమ్మించి ఒకరికి తెలియకుండా మరోకరికి ఇలా ఏకంగా ఓ వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకొన్నాడు. ఈ ఉదంతం నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహారెడ్డి తాపీ మేస్రీగా పని చేస్తుంటాడు. 2009లో ధన్వాడ మండలంలోని రాంకిష్టయ్యపల్లికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు(బాబు, పాప) పుట్టారు. మొదటి భార్యకు తెలియకుండా 2012లో అప్పిరెడ్డిపల్లికి చెందిన మహిళను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై ఒక పాప ఉంది. అనంతరం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు.
రెండో పెళ్లి గురించి తెలుసుకున్న మొదటి భార్య అతడిని నిలదీయగా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె కొంతకాలంగా ఒంటరిగా ఉంటోంది. మేస్త్రీ పనుల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్ వెళ్లే వెంకట నర్సింహారెడ్డి అక్కడ పనిచేస్తున్న కోయిలకొండ మండలానికి చెందిన మహిళకు మాయమాటలు చెప్పి మూడోపెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. భర్త ఇంటికి రావడం లేదని రెండో భార్య వెళ్లి ఆరా తీయగా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం పెట్టింది. అంతటితో ఆగని అతడు నారాయణపేట మండలం అప్పక్‌పల్లికి చెందిన మరో మహిళను లోబరుచుకుని తనకు ఇంకా పెళ్లికాలేదని చెప్పి గత నెలలో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులకే మొదటి భార్య వద్దకు వెళ్లి వేధిస్తుండటంతో ఆమె సఖి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అతడి పెళ్లిళ్ల బాగోతం చెప్పడంతో షీ టీం బృందం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. తమను పెళ్లి పేరుతో మోసం చేసిన నర్సింహారెడ్డిని కఠినంగా శిక్షించాలని మహిళలు కోరుతున్నారు.