తెలంగాణలో అయితే.. భూ సమస్యల పరిష్కారం కోసమని ధరణి పోర్టల్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ఆ పోర్టల్, రైతు కోసం ప్రవేశపెట్టిన పథకాలు.. రైతు ప్రభుత్వాలు.. ఏవీ ఈ అన్నదాతను కాపాడలేకపోయాయి. కనీసం.. ధైర్యం కూడా ఇవ్వలేకపోయాయి. పోరాడి పోరాడి అలసిపోయిన అన్నదాత.. తనకు అన్నం పెట్టే భూతల్లి ఒడిలోనే ఊపిరి తీసుకున్నాడు.
మెదక్ జిల్లా కోవిడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. శ్రీశైలం అనే యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు కారణం చెప్పి అందర్నీ కంటతడి పెట్టించారు. బలం.. బలగం లేని తనను.. అధికారం ఎలా బలి తీసుకుందో వివరంగా చెప్పి తనువు చాలించాడు. వ్యవసాయ భూమినే తల్లిలా భావించి.. సేద్యం చేసే తనను.. రాజకీయం, అధికారం బతకమియ్యలేదని భోరుమన్నాడు. ఇన్నాళ్లు అతనికి ఊపిరి ఊదిన భూతల్లి ఒడిలోనే ఊపిరి వదిలాడు.
దేవులపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలంకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అతని అమ్మానాన్న దాన్ని సాగుచేసి.. శ్రీశైలంను పోషించారు. ఇప్పుడు ఆయన కూడా అదే భూమిని నమ్ముకొని భార్యాబిడ్డల్ని పోషిస్తున్నారు. ఐదెకరాల పొలం ఉన్నా.. ఒక్క గుంట భూమికి కూడా పట్టా లేదు. తన తల్లికి తెల్వక పట్టా చేయించుకోలేక పోయిందని శ్రీశైలం వివరించారు. ఇదే పొలాన్ని సాగు చేసుకుంటూ మమ్మల్ని సాకిందని కన్నీటి పర్యంతం అయ్యాడు.
ఈ ఐదెకరాల్లో పల్లె ప్రకృతి వనం పెడతామని గ్రామ సర్పంచి, ఫారెస్ట్ అధికారులు బాధపెట్టారని శ్రీశైలం వాపోయారు. ఎంత బతిమాలిన వినకుండా.. 50 వేలు పెట్టుబడి పెట్టి మిరప చేను సాగు చేస్తే.. తాము లేని సమయంలో జేసీబీతో మొత్తం చదును చేశారని బాధిత రైతు కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు కన్నతల్లి ఎంతో.. ఈ భూమి అంత అని కన్నీరు పెడుతూ చెప్పారు. ఈ భూమి తప్ప తనకు ఏం లేదని.. దీంట్లో సాగు చేసుకుంటూనే బతుకుతున్నానని కన్నీరు పెట్టుకున్నారు.
తనకు ఎలాగూ న్యాయం జరగలేదని.. కనీసం తన పిల్లలకు అయినా న్యాయం చేయాలని వేడుకున్నారు. తన పిల్లలకు న్యాయం జరిగే వరకు తాను పోస్ట్ చేసిన వీడియోను షేర్ చేయాలని కన్నీరు పెడుతూ వేడుకున్నారు. జై హింద్, జై భారత్ అంటూ.. తనతో తెచ్చుకున్న మందుడబ్బాను తెరిచి తాగాడు. ఈ విచారకరమైన ఘటనలో మరో విషాదం ఏంటంటే.. శ్రీశైలంకు జన్మనిచ్చిన తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని.. తన పొలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని సర్పంచ్, అటవీ అధికారులు ఒత్తిడి చేయడంతో మెదక్ రైతు శ్రీశైలం వీడియో రికార్డ్ చేసి తన జీవితాన్ని ముగించుకున్నాడని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి జీవితాన్ని ముగించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని.. శ్రీశైలం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.