వైద్యం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను స్థాపించడానికి, అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,479 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కానున్నాయి. ఒక్కో వైద్య కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లను అందించే సామర్థ్యంతో అభివృద్ధి చేయడంతోపాటు అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య సీట్ల సంఖ్యకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తారు.
ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ బాధ్యతలు రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) విభాగం చేపడుతుంది. కాలేజీల అప్‌గ్రేడేషన్ పనులు, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డయాగ్నోస్టిక్, హాస్పిటల్ పరికరాలు, ఫర్నీచర్‌ను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం, అప్‌గ్రేడ్ చేయబోయే ఎనిమిది జిల్లాల్లోని అనుబంధిత ప్రభుత్వ ఆసుపత్రులన్నీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి పరిపాలనా నియంత్రణను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి బదిలీ చేసింది.
2014లో రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తెలంగాణలో 700 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యను దశలవారీగా విస్తరించింది. మొదటి దశలో, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో నాలుగు మెడికల్ కాలేజీలను చేర్చింది. రెండో దశలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటయ్యే ఎనిమిది కొత్త వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం అంటే 2022-2023 నుండి పనిచేయడం ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. కొత్త కాలేజీల ఏర్పాటుతో ఒక్కోదానిలో వంద చొప్పున మరో 800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
ఎనిమిది కొత్త వైద్య కళాశాలల వివరాలు
1. రాజన్న సిరిసిల్ల: రూ. 166 కోట్లు
2. వికారాబాద్: రూ. 235 కోట్లు
3. ఖమ్మం: రూ. 166 కోట్లు
4. కామారెడ్డి: రూ. 235 కోట్లు
5. కరీంనగర్: రూ.150 కోట్లు
6. జయశంకర్ భూపాలపల్లి: రూ.168 కోట్లు
7.కుమురంభీం ఆసిఫాబాద్: రూ.169 కోట్లు
8. జనగాం: 190 కోట్లు
వైద్య కళాశాలల అభివృద్ధికి మొత్తం నిధులు: రూ. 1479 కోట్లు