కాంగ్రెస్ లోని అంతర్గత కలహాలు బీజేపీకి వరంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన రెండు రోజుల వ్యవధిలోనే దాసోజ్ శ్రవణ్ బీజేపీ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల బీజేపీ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ పలువురు సీనియర్ బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా స్వీకరించారు. గత శుక్రవారం శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ కు బీజేపీ నేతలు అభినందనలు తెలియజేశారు. ఎంపీ లక్ష్మణ్ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వ కార్డును శ్రవణ్ కు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు, దాసోజు శ్రవణ్ ఈ నెల 21న బీజేపీలో చేరతారని పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అంతకంటే ముందే శ్రవణ్ బీజేపీలోకి వచ్చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో అగ్ర కులాలకే ప్రాధాన్యం ఇస్తూ, బీసీ ఇతర వెనుకబడిన వర్గాల నేతలను అణగదొక్కే ప్రయత్నం జరుుగుతోందంటూ శ్రవణ్ ఆరోపణలు చేయడం తెలిసిందే.