తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష సందర్భంగా అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా మిగితా చోట పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. 544 పోస్టుల కోసం ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2లక్షల 47వేల 217 మంది దరాఖాస్తు చేసుకున్నారు. ఆదివారం దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష కోసం హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు.. మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
ఆదివారం జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరైనట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. మొత్తం 2లక్షల 25వేల 759 మంది పరీక్ష రాసినట్లు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు సంబంధించి.. త్వరలోనే ‘కీ’ని విడుదల చేస్తామని ప్రకటించింది. www.tslprb.in లో ‘కీ’ని అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది.
ప్రిలిమినరీ రాత పరీక్ష సందర్భంగా అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు జరిగాయి. హైదరాబాద్ నాగోల్ లోని శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షకు లేట్ వచ్చిన ముగ్గురిని అధికారులు అనుమతించలేదు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజీ దగ్గర ఓ అభ్యర్ధి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురానందుకు లోపలికి పంపలేదు. మెదక్ జిల్లాలో ఆలస్యంగా వచ్చిన నలుగురని పరీక్ష రాయనీయలేదు. కొంతమంది సెంటర్లు దొరక్క ఇబ్బందులు పడ్డారు.