మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడ తిరుమలనగర్, శ్రీ సాయి హోమ్స్ కాలనీలలో కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కనీస వసతుల కల్పనలో భాగంగా తాగునీటిని అందించినందుకు మంత్రికి ఆయా కాలనీల వాసులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. నియోజకవర్గమే నా ఇల్లు అని, ప్రతి క్షణం అభివృద్ధి గురించే ఆలోచిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నమన్నారు. నగర శివారు పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి, ఇంటింటి నల్లాలతో పాటు నూతన లైన్లు, ట్యాంకుల నిర్మాణాల కోసం 1200 కోట్ల నిధులు విడుదల చేసారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారి చొరవతో రింగ్ రోడ్డు చుట్టుప్రక్కల ప్రాంతాల అభివృద్ధి ద్వేయంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.
పెరుగుతున్న జనాభా, కాలనిలకు 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్య రాకుండా పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి, ప్రభుత్వం అమలు చేస్తుందని, నగర శివారు ప్రాంతాల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలే కీలకమని ఆ దిశగా ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధి ద్వేయంగా కృషి చేస్తున్నట్లు, గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు అయిన మేయర్లు, చైర్మన్ల తో సమావేశాలు ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేసారన్నారు. డివిజన్ ల వారీగా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా స్థలం ఉంటే ఆయా డివిజన్లలో కమ్యూనిటీ హాల్ లు, ఓపెన్ జిమ్ లు, పార్క్ లు, లైబ్రరీ లు, నర్సరీ, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని అదేశించారని మంత్రి పేర్కొన్నారు.