సింగరేణిలో సంస్థాగతమైన అలసత్వాన్ని విడనాడి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను సకాలంలో చెల్లించాలని ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ డివిజన్ లోని ఆర్కే 6 గనిలో 2017 ఏప్రిల్ లో రిటైర్డైన చిరంచెట్టి కనకయ్య అనే ఉద్యోగికి ఇప్పటి వరకు 10వ వేజ్ బోర్డు ప్రకారం వేతన, భత్యాల బకాయిలు, రివైజ్డ్ కోల్ మైన్స్ పెన్షన్ చెల్లించలేదని తెలిపారు.
అధికారులకు పలుమార్లు రాత పూర్వకంగా విజ్ఞప్తులు చేసినా, ఆఫీసుల చుట్టూ సంవత్సరం పాటు తిరిగినా బకాయిలను చెల్లించకుండా కనీసం సరైన సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా పూర్తి వివరాలు అందించలేదని తెలిపారు. వెంటనే సింగరేణి డైరెక్టర్ పా చొరవ చూపి సింగరేణిలో సమాచార హక్కు చట్టం అమలుతో పాటు రిటైర్డ్ కార్మికుడికి 10 నెలల వేతన బకాయిలు, 64 నెలల కోల్ మైన్స్ పెన్షన్ బకాయిల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.