ఉద్యోగాలు వస్తే యువత ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలని బీఆర్ఎస్ సర్కార్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. నవీన్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఉద్యోగం దొరకక నవీన్ ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లే.. అయినా మానవత్వంతో పరామర్శకి వచ్చామన్నారు. ఇక్కడ ఏ పార్టీ కుటుంబం అనేది కాదు.. ప్రధాన సమస్య నిరుద్యోగమని.. నవీన్ ఆత్మహత్య చేసుకున్నది కూడా నిరుద్యోగంతోనే అని తెలిపారు. దేశంలో నిరుద్యోగంలో తెలంగాణ నంబర్ 1 అని తెలిపారు. ఏడాది క్రితం అసెంబ్లీలో నిలబడి 88 వేల ఉద్యోగాలు అంటూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాదిలో నోటిఫికేషన్ ఇచ్చింది 26 వేల ఉద్యోగాలుకు మాత్రమే. అందులో 8 వేల ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిగాయన్నారు షర్మిల.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 రాయొద్దని రెచ్చగొట్టారని.. మరి 8 ఏళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వ చేతకాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు వచ్చాయన్నారు. బిడ్డ ఏంపీగా ఓడిపోతే జాబ్ లేదని వెంటనే ఎమ్మెల్సీ జాబ్ ఇచ్చారన్నారు. తెలంగాణ బిడ్డలు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. మరోవైపు.. కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ అయితే నాకేం సంబంధం అని మంత్రి కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీకి పారదర్శకత ఉందని పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు.
33 లక్షల మంది జీవితాలతో ఆడుకోవడమే పారదర్శకతనా అని ప్రశ్నించారు. ఇద్దరికి మాత్రమే తెలియాల్సిన పాస్‌వర్డ్ అందరికీ తెలియడమే ట్రాన్స్పరెన్సీ అంటారా అని నిలదీశారు. పైగా.. రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారని.. దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాల మీద శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బోర్డును రద్దు చేయాలని.. రద్దు చేసిన పరీక్షలను మళ్లీ తొందరగా నిర్వహించాలని కోరారు.
ఉద్యోగాలు వస్తే యువత ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలని షర్మిల అడిగారు. రాష్ర్టంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కనీసం ప్రైవేట్ సెక్టార్‌లో అయినా ఉద్యోగాల కల్పన లేదు. ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించి ఉంటే నవీన్ లాంటి నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కి అసలు పరిపాలన కూడా చేతకాదు. నోటిఫికేషన్‌లు ఇవ్వడం అంతకన్నా చేతకాదని విమర్శించారు. నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామని మోసం చేశారన్నారు.
కేసీఆర్ చేసిన మోసాలకు నిరుద్యోగులు లెటర్లు రాసి పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగుల చావులకు కారణం కేసీఆరేనని ఆరోపించారు షర్మిల. సకాలంలో నోటిఫికేషన్లు ఇస్తే ఎవరు ఆత్మహత్యలు చేసుకోరని షర్మిల తెలిపారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న హత్యలేనన్నారు. నిరుద్యోగుల తల్లిదండ్రుల బాద అంతా ఇంతా కాదని.. బిడ్డలను చదివించి తప్పు చేశాం అని ఏడుస్తున్నారంటూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.