హైదరాబాద్ నగరంలో ప్రైవేటు ఫైనాన్షియర్ల ఆగడాలు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చక్రవడ్డీలు వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కిడ్నాప్‌లు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా.. నగరంలో ఓ మాజీ హోంగార్డును ప్రైవేటు పైనాన్షియర్ దాడిలో మృతి చెందాడు. బాధితుడు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్ సదన్ భానునగర్‌కు చెందిన మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో అసలు, వడ్డీ కలిపి అప్పు తీర్చాడు. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా రిజ్వాన్‌ను ఐఎస్ సదన్ నుంచి కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో ఉంచింది. రెండు రోజుల పాటు అతడిని చిత్ర హింసలకు గురి చేశారు.
విషయం తెలుసుకున్న బాధితుడి తండ్రి రూ. 2 లక్షలు చెల్లించి కొడుకును విడిపించుకున్నాడు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో తండ్రి ఫిర్యాదు చేయలేకపోయారు. నిందితులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకపోవడంతో బాధితుడిని ఇంటికి తీసుకొచ్చిన తరువాత ఒవైసీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రిజ్వాన్ మరణించటంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రైవేటు ఫైనాన్షియర్ చిత్రహింసలకు గురి చేయటంతో తన కుమారుడు మృతి చెందినట్లు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.