మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో పాటుగా ఐటీ ఉద్యోగులు, పలు సంఘాలు ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు.. ఆయన కూడా తన సంఘీభావాన్ని తెలియజేశారు. చంద్రబాబు తెలుగు జాతి సంపదని.. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.చంద్రబాబు పేరు వాడుకొని ఎంతోమంది లబ్ధి పొందారని.. ఆయన ఎంతోమంది జీవితాలు నిలబెట్టారని అన్నారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని.. ఈసారి తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదన్నారు. చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో మగ్గుతుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు అన్నారు.
ఇలా పార్కుల ముందు, రోడ్లపై కాకుండా.. సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని అందరూ ధర్నాలు చేయాలన్నారు గణేష్. ఐటీ ఉద్యోగులకు చీము నెత్తురు ఉంటే నెలరోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతుళ్ళకు వెళ్ళి ధర్నాలు చేయాలన్నారు. చంపుతారా.. చంపేయమని చెప్పండని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని.. ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు చంద్రబాబుకు మంచి జరగాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు వెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అయితే పోలీసులు వారిని హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గుడికి వెళ్లేందుకు కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని భగవంతుని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దేవుడికి బాధలు చెప్పే స్వేచ్ఛ కూడా ఈ పాలనలో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఈ అరాచకాలు బయటపడతాయని భయమా అన్నారు. పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా రోడ్డుపైకి వస్తుంటే అడ్డుకోవడం దేనికి సంకేతమన్నారు. టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టేందుకు గుడికి బయలుదేరిన వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టు చేసి బుద్దా వెంకన్నను తీసుకెళ్లే సమయంలో పోలీస్ జీవులకు తన వాహనాలను అడ్డుపెట్టి టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బుద్దా వెంకన్నకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది. దుర్గగుడికి వెళ్లేందుకు తమ అనుమతి కావాలంటూ పోలీసులపై వెంకన్న మండిపడ్డారు. అమ్మవారికి కొట్టవలసిన కొబ్బరికాయలను పోలీసులు ముందు కొట్టి మరీ బుద్దా వెంకన్న నిరసన తెలిపారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని సింహాచలం తొలపాంచ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడు స్వామి అంటూ కన్నీటితో స్వామివారిని బండారు వేడుకున్నారు. సింహాచలం కొండమీద కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారా అంటూ పోలీసులతో మాజీ మంత్రి వాదనకు దిగారు. జైల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆయన త్వరగా విడుదల కావాలని కోరుకోవడానికి సింహాచలం వస్తే పోలీసులు తమను అరెస్ట్ చేయడం చాలా దారుణమని మండిపడ్డారు.