వినాయక చవితి పర్వదినాన ఓ బస్సు కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన సాయితేజ (24) ఆర్టీసి బస్సు కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతడి తండ్రి మరణించటంతో ఆ ఉద్యోగం సాయితేజకు వచ్చింది. కొన్నాళ్లు సక్రమంగానే ఉద్యోగం చేసిన సాయితేజ మద్యానికి బానిసయ్యాడు. ఫూటుగా తాగుతూ విధులకు డుమ్మా కొట్టడం ప్రారంభించాడు.
విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో సాయితేజ తల్లి మందలించింది. ఈ వయస్సులో తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని.. కష్టాల్లో ఉన్నామని సక్రమంగా డ్యూటీకి వెళ్లాలని గట్టిగా చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన సాయితేజ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నర్సాపూర్ ఆర్టీసీ డీపో ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అది గమనించిన డిపో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. అనంతరం సాయితేజను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన సాయితేజ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇలా చిన్న విషయానికే యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేయటంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.