తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ తలపెట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. తెలంగాణ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలోకి మావోయిస్టు యాక్షన్ టీం ప్రవేశించిందని నిఘా వర్గాల సూచనలతో ఎటువంటి అవాంఛనీయ సంకటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. యాక్షన్ టీం కదిలికలపై నిఘా పెట్టారు.
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గోదావరి పరివాహక ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ప్రధాన రహదారులపై నిత్యం ఏదో ఒకచోట పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుకుప్ప అటవీ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి సమయంలో మావోయిస్టులు ధాన్యం లారీని దగ్ధం చేసిన విషయం విదితమే. ఇది మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం పని అని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెంతోపాటు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లా ఎస్పీ గౌస్‌ఆలం ఆదేశాల మేరకు.. ఎటునాగారం ఏఎస్పీ సంకీర్త్ సూచనల మేరకు వెంకటాపురం సీఐ ఆధ్వర్యంలో వెంకటాపురం, వాజేడు, పేరూరు ఎస్‌ఐలు ఆర్.అశోక్, వెంకటేశ్వర్లు, రమేష్ తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనదారుల లైసెన్సులు, ఆధార్ కార్డుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికల సందర్భంగా పోలీసు శాఖ అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.