నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలంలోని తన స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లెంలలో గురువారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో అరాచక శక్తులను ఓడించాలని కోరారు. మన ఓటు మన భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 12.36 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 3.26 కోట్ల మంది ఓటర్లలో 65 లక్షల మంది ఓటు వేశారు. హైదరాబాద్ లో పోలింగ్ మందకొండిగా సాగుతుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ కోరుతుంది. సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.