తెలంగాణ సాగునీటిపారుదల అభివృద్ధి,ఆయకట్టు శాఖ కార్యదర్శిగా సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో నెంబరు 1582ను ఇటీవల విడుదల చేసింది. అలాగే రెవెన్యూ రికవరి శాఖ బాధ్యతలు సైతం స్మితాసభర్వాలే చూస్తారు. ఇకపోతే పర్యావరణం, సైన్స్, సాంకేతిక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పూర్తి అదనపు బాధ్యతలు చేపడతారు. మళ్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేవరకు ఈ జీవో అమల్లో ఉండనుంది. ఇప్పటివరకు ఈ రెండు శాఖల విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రజత్‌కుమార్ గురువారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.
1991బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రయివేటు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఆయన కూతురి పెండ్లికి ఒక ప్రయివేటు కంపెనీ ఆర్థిక సహకారం అందుకున్నారనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ విమర్శలను రజత్‌కుమార్ ఖండించారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం అరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే ప్రచారం సాగునీటి శాఖలో ఇప్పటికే ఉన్నది.