ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగ్గారెడ్డి గెలిచేవరకు ఆ పని చేయనని అభిమాని శపథం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 09:23 PM

ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్.. కేవలం సినిమా హీరోలకే కాదండోయ్.. పొలిటికల్ లీడర్లకు కూడా ఉంటారు. తమ అభిమాన నేత కోసం.. ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమంటారు. తమ హీరోను ఎమైనా తక్కువ చేసి మాట్లాడితే ఎలా అయితే.. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారో.. అంతకు మించి రాజకీయ నాయకుల కోసం ఘర్షణ పడటమేకాదు రక్తాలు చిందిస్తుండటం తరచూ చూస్తుంటాం. తమ నాయకుని కోసం ఏం చేయడానికైనా వెనకాడరు వాళ్ల అభిమానులు. అలాంటి అభిమానులు కలిగిన నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.


ముక్కుసూటి మాటలతో రెబల్ లీడర్‌గా, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి.. ప్రజానాయకుడిగా, మాస్ లీడర్‌గా జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రాణాలు కూడా ఇచ్చేంత అభిమానం ఉన్న ఫాలోవర్లు కూడా జగ్గారెడ్డికి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈ సన్నివేశం. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా.. జగ్గారెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేవరకు తాను చెప్పులు తొడుక్కోనంటూ ఓ అభిమాని శపథం చేశారు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సమావేశంలోనే వేదికపైకి ఆ అభిమానిని పిలిచి హితబోధ చేశారు. "ఎన్నికల్లో ఓడిపోయిన నేను, నా భార్య ఎంచక్కా చెప్పులు వేసుకుని తిరుగుతున్నాం.. నువ్వు మాత్రం ఎందుకు కాళ్లు కాల్చుకుంటావు. నీకెందుకు అంత బాధ" అని అతన్ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటమలు సాధారణమేనని.. దానికోసం ఇలా ఆరోగ్యాలు పాడు చేసుకోవటం సరైన నిర్ణయం కాదన్నారు. "ఒకవేళ నీకు ఏమైనా అయితే నేను హాస్పిటల్ వరకే రాగాలను.. డబ్బులు ఇవ్వగలను.. అంతేకానీ నీ వెంట రాలేను కదా.." అంటూ మంచి మాటలు చెప్పారు.


అభిమానం అనేది మనసులో ఉంటే చాలని.. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని అని అభిమానికి నచ్చజెప్పారు జగ్గారెడ్జి. ఈ మాటలతో జగ్గారెడ్డి అక్కడున్న మిగతా కార్యకర్తల మనసులను కూడా గెలుచుకుని వాళ్లను కూడా అభిమానులుగా మార్చేసుకున్నారు. ఆయన చెప్పిన మాటలతో.. సభలో చప్పట్ల మోత మోగింది. జగ్గారెడ్డి అంటే ఘాటు వ్యాఖ్యలే కాదు.. మంచి మనసు కూడా అంటూ పొగిడారు. తన కోసం ఎవరైనా అభిమాని ఇలాంటి పనులు చేస్తున్నారంటే.. ఉప్పొంగిపోయి దాన్ని ప్రచారం చేసుకునే నేతలున్న రోజుల్లో.. తనకోసం ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని హితబోధ చేసేవాడే అసలైన ప్రజానాయకుడంటూ కార్యకర్తలు పొగడ్తలతో ముంచెత్తారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com