ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. కవితకు ఈనెల 23 వరక జ్యుడిషీయల్ రిమాండ్ విధిస్తూ.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కవితను మరోసారి తీహార్ జైలుకు తరలించారు. కాగా, మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఇవాళ ఉదయం కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరు పరిచారు.
వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాదులు.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని తెలిపారు. ఆమె విచారణకు సహకరించలేదని.. కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యుడిషీయల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఈడీ కూడా కవితను రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.
ఇక కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చే సమయంలో కవిత మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సీబీఐ విచారణపై కీలక కామెంట్స్ చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని తీవ్ర విమర్శలు చేశారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారన్నారు. ఆడిగిందే అడుగుతున్నారని.. గత 2 సంవత్సరాల నుంచి అదే విషయాన్ని అడుగుతున్నారన్నారు. విచారణలో కొత్తగా అడిగేది ఏం లేదని కవిత వ్యాఖ్యానించారు.
సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆమె సోదరుడు కేటీఆర్ ఆదివారం కలిశారు. కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్‌తో కలిసి ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్.. కవితతో ములాఖత్ అయ్యారు. ఆదివారం సాయం త్రం 5:45 గంటలకు సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన కేటీఆర్.. 7:40 గంటలకు బయటకు వచ్చారు. సీబీఐ కస్టడీలో వసతులు, విచారణ తీరు, ఏయే అంశాలపై విచారణ,, తిహార్ జైలులో పరిస్థితి, సీబీఐ అరెస్టు సమాచారం ఎప్పుడు తెలిసింది ? కేసు విచారణలో ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్ పిటిషన్ తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్ల తెలిసింది. బెయిల్ వస్తుందని, ధైర్యంగా ఉండాలని కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఇక కవిత సాధారాణ బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.