హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుశ్యం విపరీతంగా పెరుగుతోంది. రోడ్లపై వెళ్లే వాహనాలు, భారీ సరుకు రవాణా వెహికల్స్, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్ క్రాకర్స్ కాల్చటం, లౌడ్ స్పీకర్లు, డీజేలు తదితర కారణాలతో చెవులకు చిల్లులు పడుతున్నాయి.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా చూస్తే.. జూబ్లీహిల్స్ నివాసిత ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. శబ్ద తీవ్రత 70 డెసిబుల్స్ దాటితే చెవుడు కూడా వచ్చే ప్రమాదం ఉండగా.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యధికంగా 76.25 -78.52 డెసిబుల్స్‌గా నమోదైందని ఇటీవల పీసీబీ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ లెక్కల ఆ ప్రాంతంలో నివసిస్తే చెవుడు రావటం పక్కా.
నిర్దేశిత పరిమితుల ప్రకారం నివాసిత ప్రాంతాల్లో ఉదయం 55 డెసిబుల్స్, రాత్రి వేళ 45 డెసిబుల్స్‌గా ఉండాలి. కానీ చాలా ప్రాంతాల్లో అంతకు మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. రూల్స్ ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నివాస ప్రాంతాల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించకూడదు. అయితే జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం డీజే హోరు మొదలయ్యేది అప్పుడే. దీనికి తోడు భారీగా సౌండ్ వచ్చే సెలెన్సర్లు అమర్చిన బైకులు, కారు రేసింగ్‌లతో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగింది.
శబ్ద కాలుష్యం పెరిగితే డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శబ్దం హద్దు మీరితే.. గుండె కొట్టుకునే వేగం, రక్తపీడనం పెరుగుతుందని అంటున్నారు. 70 డెసిబుల్స్ దాటితే చెవుడు వచ్చే ప్రమాదం ఉందని... నిద్రలేమి, తలనొప్పి, అలసటకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే శబ్ద కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.