తెలంగాణలో మెున్నటి వరకు మబ్బులు కమ్ముకున్నాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. కూల్ సమ్మర్‌ను ప్రజలు ఎంజాయ్ చేశారు. తాజాగా.. భానుడు మరోసారి భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 తర్వాత కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. మరో రెండు జిల్లాల్లో 41.5 డిగ్రీలపైన నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలాల్లో 42.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 42.4 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోనూ ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం మూసాపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని.. బయటకు వెళితే టోపీ, గొడుగు వంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురి కాకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలని అంటున్నారు.