ఇప్పటి వరకు నకిలీ ట్రైన్ టికెట్లు చూసుంటాం. తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల గురించి విని ఉంటాం. ఇవి సర్వసాధారణంగా నిత్యం జరిగే ఘటనలు. అధికారులు వారిని పట్టుకోవటం, కేసులు పెట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ఫ్లైట్ టికెట్‌తో జర్నీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ టికెట్‌తో ఫ్లైట్‌లో కూర్చున్నాడు కూడా. చివరి నిమిషంలో గుర్తించిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీస్‌లో గోవా వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నెంబరుతో టికెట్‌తో పాటు వెబ్ బోర్డింగ్ పాస్‌ను ఫేక్‌వి సృష్టించాడు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు పూర్తి చేసుకొని గోవా విమానంలో దర్జాగా ఎక్కి కూర్చున్నాడు.
అప్పటికే అసలు టికెట్ తీసుకున్న వ్యక్తి ఎయిర్‌పోర్టులో తనిఖీలు పూర్తి చేసుకుని అదే విమానం ఎక్కారు. ఈ క్రమంలో ఒకటే పేరుతో రెండు టికెట్లు ఉన్నట్లు గుర్తించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే విమానాశ్రయం సెక్యూరిటీకి సమాచారం అందించారు. కోటేశ్వర్‌రావుది నకిలీ టికెట్‌గా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు.