అంబులెన్స్ పేరుతో కొంత మంది దందాలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాల్సిన అంబులెన్సులను.. సాధారణ ప్రయాణికులను చేరవేసే ట్రావెల్స్ వాహనాలుగా వాడుతూ.. జేబులు నింపుకుంటున్నారు. అంబులెన్స్ పేరుతో.. లోపల ఎలాంటి రోగులు లేకున్నా.. సైరన్ వేసుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించటంతో.. వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాహనాల్లో అత్యవసర రోగులు లేకున్నప్పటికీ.. సిగ్నల్స్ దగ్గర ఆగకుండా వెళ్లిపోతుండటమే కాదు.. సైరన్‌లు పెట్టుకుని రాంగ్‌రూట్‌లో వెళ్తూ.. ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. లోపల ఎవరున్నారన్నది బయటికి కన్పించకుండా ఉండేందుకు.. అంబులెన్స్ నిర్వాహకులు కొందరు తమ వాహనాలకు బ్లాక్‌ఫిల్మ్‌లను వినియోగిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ఈ దందా గురించి పోలీసులకు సమాచారం అందటంతో.. అంబులెన్స్‌లపై దృష్టి సారించారు. బోయిన్‌పల్లి మీదుగా నగరంలోకి ప్రవేశించే పలు జిల్లాల అంబులెన్స్‌లపై వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా.. 31కి పైగా నకిలీ అంబులెన్స్‌లను గుర్తించినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో 5 అంబులెన్స్‌లకు ఎలాంటి పర్మిట్ లేదని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా.. అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడంతో పాటు డ్రైవర్లకు లైసెన్స్‌లు కూడా లేవని పోలీసులు గుర్తించారు.
ఆర్టీఏ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నడిపిస్తున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు. ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. సైరన్ దుర్వినియోగం చేసిన వారితో పాటు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్న వారికి, రాంగ్‌రూట్లలో వెళ్తున్న మరి కొన్ని అంబులెన్స్‌ల డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇవ్వటమే కాకుండా జరిమానాలు కూడా విధించినట్టు తెలిపారు. ఆర్టీఏ పర్మిట్ లేకుండా అంబులెన్స్ పేరుతో ప్రయాణికులను తరలిస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన అంబులెన్స్ వాహనాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్‌లు సైరన్‌లను వినియోగించాలి.
అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సౌకర్యం ఉండాలి.
ఒక నర్సుతో పాటు అనుభవం ఉన్న వైద్యుడు ఉండాలి.
వాహనం పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉండాలి.
ఆర్టీఏ పర్మిట్ ఉండాలి.
లైసెన్స్‌తో కూడిన నిపుణులైన డ్రైవర్లు ఉండాలి
అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించేపుడు, రోగులను పరీక్షలకు తీసుకెళ్లేపుడు సైరన్ వేయకూడదు.
అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకూడదు.
రాంగ్‌రూట్‌లో వెళ్లకూడదు.
ప్రయాణికులను తరలించకూడదు.
ఆస్పత్రులకు సంబంధించిన సేవలకు మాత్రమే వినియోగించాలి.