హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న క్రమంలో తన నాలుగు కేజీల బంగారం దొంగిలించినట్టు ఓ బంగారం వ్యాపారి.. చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను శుక్రవారం రోజున (జులై 26న) హైదరాబాద్ నుంచి మంబయికి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా.. అర్ధరాత్రి సమయంలో జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలోని ఓ దాబా దగ్గర చాయ్ తాగటం కోసం బస్సు ఆపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. బస్సులో చోరీ చేసి.. తనకు సంబంధించిన నాలుగు కేజీల బంగారాన్ని దొంగిలించినట్టు చెప్తున్నారు.
బస్సు ఎక్కిన తర్వాత చూసుకుంటే బంగారం కనిపించకపోవటంతో.. బాధితుడు చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాబాలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా దృశ్యాల్లో అనుమానంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వారిని పట్టుకుని.. విచారిస్తే ఈ దొంగతనం గురించి తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
సాధారణంగా అయితే.. ఇళ్లల్లో దొంగలు పడి బంగారం, డబ్బు చోరీ కావటం చూస్తూనే ఉంటాం. కానీ ఇలా బస్సులో.. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొంగతనం కావటమనేది.. అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ వ్యాపారి ఎంత జాగ్రత్తగా ఉండాలి.. ఇలా చాయ్ కోసం నిర్లక్ష్యంగా వదిలేసి వస్తే ఇలానే జరుగుతుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే.. అసలు నిజంగా చోరీ జరిగిందా.. కావాలనే కంప్లైంట్ ఇచ్చాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.