హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటకలను అనుసంధానం చేస్తూ ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య 44వ నెంబరు జాతీయ రహదారి ఉండగా.. దీనికి అదనంగా హైస్పీస్ హైవేను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది. ‘మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్-2047’లో భాగంగా ఈ రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది.
నాగ్‌పూర్ (మహారాష్ట్ర)- హైదరాబాద్ (తెలంగాణ)- బెంగళూరు (కర్ణాటక) మధ్య రాకపోకలను మరింతగా పెంచాలనే ఉద్దేశంతో రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా హైవేను అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అలాగే, హైదరాబాద్, బెంగళూరులను అనుసంధానం చేయాలని నిర్ణయించిన కేంద్రం... అందుకోసం డీపీఆర్‌కు కసరత్తు చేస్తోంది. ఈ డీపీఆర్ తయారీకి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది. ధీనికి సెప్టెంబరు 12 తుది గడువుగా నిర్ణయించింది.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రహదారిని ఆరు వరుసల్లో నిర్మించాలన్నది కేంద్రం ప్రతిపాదన. ముందు 12 వరుసలుగా ఈ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన చేసినప్పటికీ ప్రస్తుతం ఆరు వరుసలకే పరిమితమైనట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే, ఒకేసారి ఈ ఆరు వరుసల పూర్తిచేస్తారా? తొలుత నాలుగు వరుసలు, ఆ తర్వాత మరో రెండు వరుసలను విస్తరిస్తారా? అనేది ప్రస్తుతానికి స్పష్టత రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.
హైదరాబాద్ - బెంగళూరు మధ్య కొత్త రహదారిని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగాా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. తాత్కాలిక అంచనాల ప్రకారం 508 కిలోమీటర్ల మేర కారిడార్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ఉన్న నేషనల్ హైవే 44 556 కి.మీ.లతో నాలుగు వరుసల్లో అందుబాటులో ఉంది. ఇందులో తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 106 కి.మీ.ల మేర విస్తరించింది.
వాహనాల రద్దీ పెరుగుతుండటంతో ప్రస్తుతం రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని తొలుత నిర్ణయించారు. అందుకోసం రెండేళ్ల కిందటే డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. కానీ, వివిధ కారణాలతో ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టారు. తాజాగా, హైస్పీడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారిపై రాకపోకలు, రద్దీ గురించి అధ్యయనం చేయించింది. దీంతో హైస్పీడ్‌కు తగినట్టు హైవే విస్తరణ సాధ్యం కాదని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి కేంద్రం ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించింది.