తెలంగాణలోని ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటించనున్నట్టు.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రోజున (జులై 26న) ఉపాధ్యాయ సంఘాలతో వేం నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ బకాయి ఉన్న డీఏ ప్రకటించనున్నట్టు వెల్లడించారు. అయితే.. ఒకటా, రెండా అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తెలిపారు.
యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరగా.. ముందుగా వేం నరేందర్ రెడ్డితో చర్చించాలని సూచించినట్టు సమాచారం. సీఎం సూచనతో ఈరోజు యూఎస్పీసీ, జాక్టో, టీటీజేఏసీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో వేం నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు. బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు ముందుగా అభినందనలు తెలిపారు.
బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు వేం నరేందర్ రెడ్డిని కోరారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు చేసిన విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన వేం నరేందర్ రెడ్డి.. అన్ని సంఘాలు చర్చించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల జాబితాను ఉమ్మడిగా రూపొందించి ఇస్తే.. మూడు జేఏసీల పక్షాన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించిన తర్వాత.. సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.
అంతకుముందు.. శాసనమండలిలో పెండింగ్ డీఏలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జీపీఎఫ్, ఇతర బిల్లులు కలిపి దాదాపు రూ.40 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు భట్టి విక్రమార్క.