రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాదాపు 100 గ్రాముల హెరాయిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అరెస్ట్ అయిన ఇద్దరు ఫెడ్లర్లను విచారిస్తే.. వాళ్లిద్దరు తండ్రి, కొడుకులుగా తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హానీఫ్ షా, సిద్ధిక్ షాలు తండ్రీకొడుకులు. హానీఫ్ షా స్క్రాప్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఎనిమిది మంది సంతానం. స్క్రాప్ గోడౌన్ ద్వారా వచ్చే డబ్బు ఏ మూలకు సరిపోకపోవటంతో.. కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో.. తన కుమారుడు సిద్ధిక్‌తో కలిసి కాస్మొటిక్ వ్యాపారం చేశాడు. అయితే కాస్మోటిక్ వ్యాపారంలోనూ నష్టాలు వచ్చాయి.
చివరికి.. డ్రగ్స్ అమ్మితే భారీగా లాభాలు వస్తాయని తెలుకుని.. తండ్రీకొడుకులు ఆ దందా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. రాజస్థాన్‌కు చెందిన మౌంటు నుంచి హెరాయిన్‌ను కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని పలువురు డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు.. పక్కా ప్రణాళికతో ఘటనాస్థలికి చేరుకుని డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తుండగా తండ్రీకొడుకులిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నెలలో హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబటం ఇది రెండో సారి. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. గతంలో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.