తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలకు బీసీ బిడ్డకే అప్పగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. దీంతో.. గత కొంతకాలంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించినట్టయింది.
గత కొంతకాలంగా టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా ఎవరు నియామకమవుతారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుండగా.. మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేరు, ఎస్సీ సామాజికవర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్‌ల పేర్లు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తెరమీదికి వచ్చిన పేర్లన్నింటిలో మహేశ్ కుమార్ గౌడ్ పేరే ముందు నుంచి ముందు వరసలో ఉండటంతో పాటు మాజీ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకే మొగ్గు చూపటంతో.. ఆయనకే పగ్గాలు అప్పజెప్తూ కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా.. తెలంగాణ కొత్త అధ్యక్షుని నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ అధిష్ఠానంతో సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షిలను కలిశారు. కాగా.. ఈ విషయంపై రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో అధిష్ఠానం విడివిడిగా మాట్లాడి.. అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి.. మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా నియమించారు.
అయితే.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించటంతో.. ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు మొండి చెయ్యే మిగిలినట్టయింది. కాగా.. ముందు నుంచి టీపీసీసీ కొత్త అధ్యక్షుని రేసులో మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, బలరాం నాయక్ పేర్లు గట్టిగా వినిపిస్తుండగా.. మరోవైపు కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి లాంటి కీలక నేతలు కూడా ఈ పదవి కోసం అధిష్ఠానం స్థాయిలో తెరవెనుక ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి. మొత్తంగా.. ఈ సీనియర్ నేతలందరినీ కాదని.. మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించటంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే.. మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుదారుడే అంటూ కొన్ని వార్తలు కూడా వినపడుతుండటం గమనార్హం.