"పాములు పట్టేవాడు పాము కాటుకే పోతాడు".. అన్న సామెత అక్షరాల నిజమైంది. అయితే.. ఇక్క పోయింది.. పాములు పట్టటంతో తలపండిన స్నేక్ క్యాచర్ కాదు.. ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ తీసుకుని మెళకువలు నేర్చుకుంటున్న యువ స్నేక్ క్యాచర్. నేర్చుకుంటున్న స్టేజ్‌లోనే.. పాములను పట్టటం పూర్తిగా వచ్చేసిందనుకుని.. నాగరాజుతోనే రకరకాల విన్యాసాలు చేస్తూ.. వాటిని వీడియోలు తీసి ఫేమస్ అయిపోదామనుకుని.. అదే పాము కాటుకు బలయ్యాడు ఓ యువ స్నేక్ క్యాచర్. ఈ విషాదకర ఘటన.. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం (సెప్టెంబర్ 06న) చోటుచేసుకుంది.
మోచి గంగారం అనే వ్యక్తి.. పాములు పట్టటంలో నిపుణుడు. అయితే.. తండ్రి చేస్తున్న పని పట్ల తన కుమారుడు మోచి శివరాజు (18)కు కూడా ఆసక్తి ఉండటంతో.. పాములు పట్టడంలో తర్ఫీదు తీసకుంటున్నాడు. అయితే.. తండ్రి ఇస్తున్న ట్రైనింగ్‌తో పూర్తిగా వచ్చేసిందనుకున్నాడో ఏమో.. పాములను పట్టుకోవటమే కాకుండా ఆ విషసర్పాలతో విన్యాసాలు కూడా చేయటం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ.. ఫేమస్ అవ్వాలన్నది శివరాజు టార్గెట్.
ఈ క్రమంలోనే.. తన పంట పొలంలో పెద్ద నాగుపాము కనిపించడంతో.. తండ్రి ఇచ్చిన ట్రైనింగ్‌తో శివరాజు చాకచక్యంగా.. దానిని పట్టుకున్నాడు. సుమారు ఆరు ఆడుగులకు పైగానే ఉన్న ఆ నాగుపామును పట్టుకోవటం వరకు ఓకే కానీ.. ఆ నాగుపాము పడిగెను నోట్లో పెట్టుకుని.. పంటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఆ వీడియో తీసినంత సేపు నోట్లో నాగుపామును పెట్టుకుని స్టైల్‌గా ఫోజులిచ్చిన శివరాజు.. అదే పాటు తనను ఎప్పుడు కాటేసిందో కూడా గుర్తించలేకపోయాడు.
కాసేపటి తర్వాత.. అంటే తన రీల్స్ మోజు నుంచి పూర్తిగా బయటికి వచ్చాక చూస్తే.. చన చేతు మొద్దుబారిపోవటం, మండటం లాంటి లక్షణాలు కనిపించాయి. అప్పటికే పాము కరిచి చాలా సేపు కావటంతో.. అందులోనూ కాటేసింది నాగుపాము కావటంతో.. విషం త్వరగానే ఒళ్లంతా పాకింది. దీంతో.. శివరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. చేతికి అందొచ్చిన కుమారుడు పాముకాటుతో మరణించటంతో.. కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు.
కాగా.. ఇప్పటికే ఈ రీల్స్ పిచ్చిలో పడి చాలా మంది యువత.. ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలన్న కోరికతో.. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే.. చాలా మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు శివరాజు కూడా అదే మార్గంలో తమ విలువైన జీవితాన్ని కోల్పోయాడు. రీల్స్ చేయటం తప్పేమీ కాకపోవచ్చు కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండొద్దన్న విషయాన్ని యువత గ్రహిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు.