మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అంటే కేవలం ఉద్యమనాయకుడు, రాజకీయ నేత మాత్రమే కాదు.. దేవుడు, వాస్తు లాంటి విషయాలను నమ్మే ఫక్తు ఆధ్యాత్మికుడు కూడా. ఉద్యమ సమయం నుంచి మొదలుపెడితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా రకరకాల యాగాలు, యజ్ఞాలు, ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. కాగా.. ఇప్పుడు మరోసారి ప్రత్యేక యాగం నిర్వహించి.. మరోసారి చర్చకు తెరలేపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ ప్రత్యేక నవగ్రహ యాగం నిర్వహించారు. శుక్రవారం (సెప్టెంబర్ 06న) ఉదయం 4 గంటల నుంచే వేద పండితుల ఆధ్వర్యంలో మొదలైన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.
గతంలోనూ.. తన ఫాంహౌస్‌లోనే ఆయుధ చండీ యాగం, రాజశ్యామల యాగాలను ఘనంగా నిర్వహించిన కేసీఆర్.. ఈసారి నవగ్రహ యాగం నిర్వహించారు. అయితే.. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న గులాబీ బాస్.. ఇప్పుడు ఉన్నట్టుండి నవగ్రహ యాగం చేయటం వెనుక కారణాలేంటంటూ.. అటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని.. ఇలా ప్రత్యేక సందర్భాల్లో యాగాలు నిర్వహించిన గులాబీ బాస్.. ఇప్పుడు ఈ యాగం చేయటం వెనుక కూడా బలమైన కారణం ఏంటా అన్న దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు తర్వాత నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు బలహీనపడిపోతోంది. అంతేకాకుండా రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా ప్రతికూలంగా మారిపోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవటమే ఈ పరిస్థితులకు నిదర్శనం. అయితే.. తమ పార్టీకి పునర్ వైభవం వచ్చేందుకే కేసీఆర్ ఈ యాగం చేస్తున్నట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. సుమారు 5 నెలల పాటు తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉండి.. మొన్ననే బెయిల్ మీద బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాగా.. అతికష్టం మీద ఐదున్నర నెలల తర్వాత షరతులతో కూడిన బెయిల్ రావటం గమనార్హం. ఈ క్రమంలోనే.. కవిత రెండు సార్లు అనారోగ్యానికి కూడా లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే.. కవితకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోందని.. జాతకపరంగా కొన్ని గ్రహాల కదలికలు సరిగ్గాలేవని.. అందుకు కొన్ని ఉపచర్యలు చేయాల్సి ఉంటుందని పండితులు సూచించారని.. అందుకే నవగ్రహ యాగం ఆచరిస్తున్నట్టు.. కల్వకుంట్ల కుటుంబానికి దగ్గరైన సన్నిహితులు చెప్తున్నారు.
ఇన్ని రోజులు అటు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా.. కవిత కూడా జైలులో ఉండటం.. పైగా గులాబీ బాస్ కేసీఆర్ ఆరోగ్యం కూడా అంతగా సహకరించకపోవటం.. వీటన్నింటి దృష్ట్యా కొంత గడ్డు కాలం నడించింది. అయితే.. ఇప్పుడు కవిత విడుదలవటం.. కేసీఆర్ ఆరోగ్యం కూడా పూర్తిగా మెరుగవటంతో.. పార్టీలో కొత్త ఉత్సహాం వచ్చిందని.. ఇక గ్రహాదోషాలకు ఉపచారం కూడా నిర్వహించి.. స్థానిక సంస్థలకు ముందు రెట్టింపు ఉత్సాహంతో రంగంలోకి దిగాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్.. ఊరూరా బస్సు యాత్రలు చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్ కూడా నడుస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా వినాయక చవితి రోజున ప్రకటించే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నారు.