తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు ఉగ్రరూపాన్ని దాల్చాయి. ఉప్పొంగి ప్రవహించి.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలను ముంచేశాయి. అడ్డొచ్చిన నిర్మాణాలను, పంటలను కూడా తమతో తీసుకెళ్లిపోయాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు లాంటి జిల్లాల్లో వాగులు ఉప్పొంగి.. ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిల్చిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గుముఖం పట్టటంతో.. ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గగా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే.. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు కిందికి వదులుతున్నారు. దీంతో.. ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు ఉప్పొంది ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి పెరగడంతో ఆలయం ముందు మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అంతేకాదు.. ఆలయంలోకి వరద నీరు చేరింది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద ప్రవహిస్తుండటం విశేషం. గత 7 రోజులుగా ఆలయం జలదిగ్బంధంలోనే ఉంటోంది. భారీ వర్షాలతో ఆలయానికి చేరుకోవటం అసాధ్యం కావటంతో.. 6 రోజులుగా రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.
రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అర్చకులు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే.. వరద పూర్తిగా తగ్గిన తర్వాతే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు. మరోవైపు.. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో.. మంజీరా నదిలో చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా.. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అయితే.. భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 28 వేల 181 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ప్రస్తుతం 15 వేల 114 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. సింగూరు పూర్తిస్థాయి నీటి మట్టం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 28.939 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా.. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డిలో 4.3 సెంటీ మీటర్ల వర్షాపాతం కురియగా.. కందిలో 4.1, కొండాపూర్‌లో 3.4, కంకోల్‌లో 3.1 సెంటిమీటర్ల వాన కొట్టింది. ఇక మెదక్ జిల్లా చిలిప్ చెడ్‌లో 2.4 సెంటిమీటర్ల వర్షం కురిసింది.