రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చి అతలాకుతలమై సర్వం కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితుల ఖాతాల్లోకి శుక్రవారం నుంచి రూ.10వేలు జమవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో గురువారం పర్యటించిన మంత్రి... బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సాయం ప్రతి ఒక్కరికీ అందుతుందని మంత్రి తుమ్మల చెప్పారు. నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మొదలైందని, నగదు జమ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. బాధితులు అధైర్యపడొద్దని , స్థానికంగా నెలకొన్న సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.
మరోవైపు, పాలేరు నియోజకవర్గంలోని బాధితులకు ప్రభుత్వ సాయంతోపాటు పొంగులేటి స్వరాజ్యం- రాఘవరెడ్డి (పీఎస్‌ఆర్) ఛారిటబుల్ ట్రస్టు తరఫున సహకారం అందించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి అన్నారు. రాజీవ్ గృహకల్ప, గ్రేడ్-4 ఉద్యోగుల కాలనీ, కరుణగిరి, జలగంనగర్, కేబీఆర్‌నగర్, అభయ టౌన్‌షిప్, ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం, రామన్నపేట ప్రాంతాల్లో పర్యటించిన పొంగులేటి.. సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు శుక్రవారం సాయంత్రంలోపు ప్రభుత్వ సాయం రూ.10వేలు వారి బ్యాంకు ఖాతాలో జమవుతాయని వివరించారు. సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. తడిసిన బియ్యం స్థానే సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో సర్వేను త్వరగా పూర్తిగా చేయాలన్నారు.
అటు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలు వరదలకు తీవ్ర ప్రభావితమయ్యాయి. వందలాది ఇళ్లలోకి నీళ్లు చేరి నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నేలపాలు కాగా.. వందలాది ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులు ఎవర్ని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వరద తగ్గిన తర్వాత ఇళ్లకు చేరుకుంటోన్న బాధితులు.. అక్కడ పరిస్థితి చూసి ఆవేదనకు గురవుతున్నారు.