తెలంగాణకు హైదరాబాద్ వాతారణశాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ, మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుందని చెప్పంది. బంగ్లాదేశ్ తీరం వద్ద ఈ అల్పపీడనం సెప్టెంబర్ 9న వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లిల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక వర్షంతో పాటుగా బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరించారు.
నేడు హైదరాబాద్ పరిధిలోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి భారీ వర్షం కురుస్తుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాగా, వాయుగుండం ముప్పు మాత్రం తెలుగు రాష్ట్రాలకు తప్పిందని హైదరాదాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండనుందని వెల్లడించింది.
ఇక ఇటీవల కురుసిన భారీ వర్షాలు రాష్ట్రంలో అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత జిల్లాలుగా ప్రకటించింది. సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలు వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. మిగతా 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేస్తామని అన్నారు. సహాయ, పునరావాస చర్యలపై ఆదివారం హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.