ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులోనే కంపెనీ ఏర్పాటు చేసి తన టాలెంట్‌తో అబ్బురపరుస్తున్నాడు.. 14 ఏళ్ల సిద్ధార్థ్ నంద్యాల. ఇటీవల అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడి నైపుణ్యం చూసి ముగ్ధుడై.. హైదరాబాద్‌లో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’కు ఆహ్వానించారు. తాజాగా ఈ సమావేశంలో సిద్ధార్థ్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు చేతి గడియారాన్ని చూసి ముచ్చటపడిన సిద్ధార్థ్.. ‘వాచీ బాగుంది సార్’ అనగా, వెంటనే ఆ వాచీని తీసి సిద్ధార్థ్ చేతికి తొడిగారు శ్రీధర్ బాబు.
ఏఐ ప్రోస్థటిక్ హ్యాండ్‌ను సిద్ధార్థ్ రూపొందించాడు. చేతులు లేనివారికి అమర్చేందుకు దీన్ని తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. తాను ఆవిష్కరించిన ప్రోస్థటిక్ హ్యాండ్‌ను ఏఐ సదస్సులో ప్రదర్శించాడు. ‘సిద్ధార్థ్ పాషన్ (అభిరుచి) స్ఫూర్తిదాయకం. అతడు ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సిద్ధార్థ్‌తో పాటు అతడి కవల సోదరి సౌమ్య సైతం మోస్ట్ టాలెంటెడ్. 14 ఏళ్ల వయసులో ఆమె కూడా ఓ కంపెనీ స్థాపించి నిర్వహిస్తోంది. వీరు హైదరాబాద్లోని రామంతాపూర్లో పుట్టారు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. చదువుకుంటూనే ఇద్దరు కవలలు సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నారు. వీరి ఆలోచనలు చూసి గ్లోబల్ సమ్మిట్కు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు.
సిద్ధార్థ్ ఏడేళ్ల వయసు నుంచే కోడింగ్లో ఆసక్తి కనబరిచారు. లింక్డిన్ లెర్నింగ్, యూట్యూబ్లో చూసి సీ, సీ++, పైథాన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఒరాకిల్, ఆర్మ్ నుంచి మిషిన్ లెర్నింగ్, ఏఐపై ప్రావీణ్యం సంపాదించి, సర్టిఫికెట్లు కూడా పొందాడు. దీంతో ప్రపంచంలోనే పిన్న వయసులో ఏఐ సర్టిఫైడ్ పొందిన వ్యక్తిగా నిలిచాడు. ఏడో తరగతి చదువుతూనే డల్లాస్ సమీపంలోని ప్రిస్కో నగరంలో ‘స్టెమ్’ ఐటీ కంపెనీని స్థాపించాడు సిద్ధార్థ్. ఏఐపై స్వయంగా ఆల్గరిథమ్లు రాస్తూ ప్రొడక్ట్స్ రూపొందించాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ రూపొందించిన ప్రోస్థటిక్ హ్యాండ్, వృద్ధుల కోసం తయారు చేసిన ‘ఫాల్ డిటెక్షన్ బ్యాండ్’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వృద్ధులు ఇంట్లో పొరపాటున జారిపడితే, ‘ఫాల్ డిటెక్షన్ బ్యాండ్’ వారి కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది.
సిద్ధార్థ్ సోదరి సౌమ్య అతడి కంటే 20 నిమిషాలు ముందు పుట్టింది. అమెరికాలో డ్రైవ్ఇట్ అనే సంస్థను నెలకొల్పింది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు అమెరికాలో 6 నెలలకు పైగా సమయం పడుతోంది. దీన్ని తగ్గించాలని భావించిన సౌమ్య.. తన ఆలోచనతో ఓ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసింది. దీని ద్వారా లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే అపాయింట్మెంట్ లభిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 10 వేల మంది దీన్ని వినియోగించుకున్నారు.
కిందటి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు డల్లాస్ పర్యటనకు వెళ్లినప్పుడు సిద్ధార్థ్ వారిని కలిశాడు. హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన సిద్ధార్థ్.. టీవర్క్స్తో కలిసి పని చేయనున్నాడు. డయాబెటిక్ రెటీనోపతిని గుర్తించేందుకు మిషిన్ లెర్నింగ్ ఏఐ ఆల్గరిథమ్లను సిద్ధార్థ్ రూపొందించాడు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు చర్చలు జరుగుతున్నాయి.