అయ్యప్ప మాలధారణలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో అయ్యప్ప మాలలు ధరించే భక్తులు.. మండల దీక్షల అనంతరం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. హైదరాబాద్ నగరం నుంచి వేల సంఖ్యలో శబరిమల వెళ్తుంటారు. దీంతో బస్సులు, ట్రైన్లు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి అయ్యప్ప దర్శన కోసం శబరిమల వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక ట్రైన్‌ను నడుపుతోంది.
మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్ నవంబర్ 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయల్దేరి ఏపీలోని పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల చేరుకుంటుంది. అనంతరం నవంబర్ 20న తిరుగు ప్రయాణం అవుతుంది. టీ, టిఫిన్, భోజనం, ప్రయాణికులకు బీమాతో కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475, థర్డ్ ఏసీలో రూ.18,790, సెకెండ్ ఏసీలో రూ.24,215గా నిర్ణయించారు. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. భక్తులకు ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే పూర్తి వివరాలకు 82879 32312, 92814 95848 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని చెప్పారు.
శబరిమల మకర జ్యోతి దర్శనం సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భక్తులు భారీగా శబరిమలకు వెళ్తుంటారు. గతంలో శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ట్రైన్లు నడిపించారు. ఈసారి కూడా ప్రత్యేక ట్రైన్లు నడిపే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా ట్రైన్లు నడపనున్నట్లు వెల్లడించారు. శబరిమల మకరజ్యోతి దర్శనం ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున ఉంటుంది. మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి దాన్ని శబరిమల మకర జ్యోతి లేదా శబరిమల మకరవిళక్కు అని పిలుస్తుంటారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాదిగా అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతారు.