సినీ నటుడు సోనూసూద్ గురించి ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నారంటే చాలు.. నేనున్నానంటూ చేయూత అందిస్తాడు. కొవిడ్ సమయం నుంచి ఎంతో మందికి సేవ చేస్తూ తాను రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటించి మెప్పించినా.. మాత్రం రియల్ హీరో బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ ఎవరికీ ఏ అవసరం ఉన్నా కాదనకుండా సహాయం చేస్తున్నారు. ఫౌండేషన్లను కూడా రన్ చేస్తూ కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకుంటున్నాడు. ఆయన గురించి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. సోనూసూద్ మరోసారి తన మంచి తననాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు కాబట్టి.
మూడేళ్ల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన నిరుపేద కృష్ణ, బిందుప్రియలది నిరుపేద కుటుంబం. వీరి మూడేళ్ల కూతురు చిన్నప్పటినుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి గుండెకు సర్జరీ చేయించాలంటే ఆపరేషన్‌కు రూ.6 లక్షలకుపైగా ఖర్చువుతుందని డాక్టర్లు తెలిపారు. వైద్యం చేయించటానికి ఆర్థిక స్థోమత లేని కృష్ణ, బిందుప్రియ దంపతులు దేవుడిపైనే భారం వేశారు.
ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే స్పందించారు. ఆ చిన్నారికి ముంబైలో ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతంచిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కష్టకాలంలో చిన్నారి ప్రాణాలు నిలబెట్టిన సోనూసోద్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. సోనూ ఎప్పటికీ రిల్ హీరో కాదని.. ఆయన రియల్ హీరో, దేవుడు అంటూ కొనియాడుతున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన దేవి కుమారి అనే యువతి చదువుకోవడానికి సోనూసూద్ సాయం చేశారు. ఆ యువతికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. బీఎస్సీ చదవాలని డిగ్రీ పట్టా అందుకోవాలనే ఆశ ఉన్నా.. కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సాయం చేయాలని అభ్యర్థిస్తూ దేవి కుమారి సాయం కోరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో సోనూసూద్ దృష్టికి వెళ్లగా.. కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు.