పోలీసుల పిల్లలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. వారికి నాణ్యమైన విద్యను అందించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముగింపు వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్ కావడంతో నాలుగు రోజుల పాటు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా 26 పోలీస్ విభాగాల నుంచి 13 బృందాలుగా ఏర్పడి పలు ఈవెంట్లు నిర్వహించారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్ అవేర్‌నెస్, ఫొటో, వీడియోగ్రఫీ, డాగ్ స్క్వాడ్ లాంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం రేవంత్ రేవంత్ ట్రోఫీలు అందజేశారు.సైబర్ క్రైమ్ సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్.. రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు అంటూ కొనియాడారు. పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది 1-5 క్లాసులతో ఈ స్కూల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు.
గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనపైనా స్పందించారు. పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టమని వివరించారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయని.. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.