నిరుద్యోగ యువత యువకులకు నైపుణ్య శిక్షణతో గ్యారంటీ ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష టీ వర్క్స్ సీఈఓ జోగేందర్ తో కలిసి పెద్దపల్లి ఐటిఐ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏ.టి.సి కేంద్రాలకు టీ వర్క్స్ అందించే సహకారం, ఏ.టి.సి కోర్సుల ద్వారా మార్కెట్ లో యువతకు అందే ఉపాధి అవకాశాల వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను టీ వర్క్స్ సీఈఓ జోగేందర్ అందించారు.
పెద్దపల్లి ఐటిఐ పరిశీలనలో ఏ.టి.సి కేంద్రాలలో ఎన్ని సీట్లు ఇప్పటివరకు భర్తీ అయ్యాయో వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మన పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం మొదటి దశలోనే 2 ఏ.టి.సి కేంద్రాలను మంజూరు చేసిందని, ఇందులో గల 6 కోర్సులకు పదవ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు అక్టోబర్ 30 లోబో అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఏ.టి.సి కోర్సుల ద్వారా యువతకు అందే నైపుణ్యంతో మార్కెట్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.ఏ.టి.సి కేంద్రాలలో వివిధ కోర్సులకు సంబంధించి వచ్చిన సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఐటిఐ రెగ్యులర్ కోర్సుల విద్యార్థుల హాజరు వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఐటిఐ భవనం రిన్నోవేషన్ పనులకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తరగతి గదులలో లీకేజీలు ఉంటే వెంటనే వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.