పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్ లో ప్రముఖ సైకాలజిస్ట్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అయిన తిరునగరి శ్రీహరి చే విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీహరి విద్యార్థినీ విద్యార్థులకు పలు ప్రేరణ కలిగించే కథలను చెప్పి, వారిలో స్ఫూర్తిని నింపారు. అలాగే పిల్లలు ఎలాంటి ప్రవర్తన అలవర్చుకోవాలి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి, భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే పిల్లలలో ఉండాల్సిన మంచి లక్షణాల గురించి వివరించారు. తన ఉపన్యాసంలో పిల్లలను భాగస్వాములను చేస్తూ వారితోనే పలు విషయాలను చెప్పిస్తూ, మిగతా పిల్లలకు కూడా మన ఆలోచనా విధానం ఎలా ఉంటే మనల్ని అందరూ గుర్తిస్తారు అనే విషయాలను వారు ప్రత్యక్షంగా నేర్చుకునేలా వివరించారు.
పిల్లలు ఏకాగ్రతతో టీచర్లు చెప్పిన పాఠాలను విని, మళ్ళీ ఒకసారి చదువుకుంటే అది చాలా రోజులు గుర్తుండి పోతుందని, అందుకే పిల్లలంతా తమ లక్ష్యాలను చేరుకోవాలంటే పట్టుదల, క్రమశిక్షణ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. మనల్ని మనం నమ్మితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు. అందుకే ముందుగా మన పట్ల మనకి నమ్మకం ఉండాలన్నారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ కాలంలో పిల్లలంతా సోషల్ మీడియా ప్రభావంతో తమ చదువుని నిర్లక్ష్యం చేస్తూ, తమ ప్రవర్తన, క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారు అని, ఈ రకమైన మోటివేషన్ క్లాసెస్ నిర్వహించడం వల్ల వారు కొంతనైన మారి, సమాజం గర్వపడే స్థాయికి ఎదగాలనే ఒక ఆశయంతో ఈ రోజు ప్రముఖ మోటివేటర్ శ్రీహరి చే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపి, పిల్లలకి అద్భుతమైన విషయాలను చెప్పి, వారిలో మార్పు వచ్చేలా కృషి చేసిన శ్రీహరి కి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.