హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపొందించిన చిత్రాన్ని వాడారనీ, రైతుల లెక్క విషయం లోనూ సీఎం అదే టెక్నిక్ వాడారని ఆరోపించారు. నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు రుణాలు 40 శాతం కూడా మాఫీ కాలేదని చెప్పారు. కానీ తరుచూ నిబంధనలతోపాటు రుణమాఫీ తేదీలను మారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ నిబంధనలు, తేదీలు మారుతున్నాయనీ. అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రం నిత్యం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతు న్నాయని విమర్శించారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆ సంస్థ ఆహ్వానించింది. వచ్చే నెల నవంబర్ 9నుంచి కౌలాలంపూర్లో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపింది. మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిసి ఆహ్వానం అందించింది. ఈ సందర్భంగా మలేషియా లోనూ తెలంగాణ వాసులు తమకంటూ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాలతో పుట్టిన గడ్డతో మమేకం కావడం పట్ల కేటీఆర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్తీక్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.