తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవాళ్టి నుంచి పరీక్షలు జరుగుతున్న దశలో, ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న వేళ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సైతం త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా మెయిన్స్ పరీక్షల నిర్వహణలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కోర్టు గుర్తు చేసింది. నవంబర్ 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఇవాళ్టి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. గడిచిన కొన్నిరోజులుగా పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసన చేపడుతున్న నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా 144 సెక్షన్ విధించడం గమనార్హం. అభ్యర్థులను, వారి హాల్ టికెట్లను, ఇతర గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది.