ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భువనగిరి: బాలసదన్‌లో దారుణం.. పదేళ్ల అనాథ బాలికపై లైంగిక దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:20 PM

అనాథ బాలికలకు ఆశ్రయం కల్పించాల్సిన బాలసదన్‌లో దారుణం చోటు చేసుకుంది. పదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. భవనగిరి పట్టణంలోని బాలసదన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న ఓ కార్యక్రమం నిర్వహణ పేరుతో డీసీపీఓతో పాటు మరి కొంతమంది వ్యక్తులు రాత్రి 7 గంటల సమయంలో భువనగిరి బాలసదన్‌కు వచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ బాలిక బాత్రూం కోసం వెళ్లింది. బాలికను వెంబడించిన ఓ వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది.


గమనించిన బాలసదన్ సిబ్బంది ఆరా తీయగా ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడంటూ తన శరీరంపై గాయాలను చూపించింది. వెంటనే సిబ్బంది డీసీపీఓకు సమాచారం అందించారు. డీసీపీఓ సంబంధిత వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టకపోగా విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెబితే అందరి ఉద్యోగాలు పోతాయని ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా బాలికను వలిగొండలోని ప్రైవేట్ అనాథాశ్రమానికి తరలించినట్లు తెలిసింది. కాగా ఆదివారం (అక్టోబర్ 20) బాధితురాలు ఉన్న వలిగొండ శాంతి నిలయంలో డీసీపీఓ సైదులు, కౌన్సిలర్ వెళ్లి విచారణ జరపగా తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని చిన్నారి చెప్పినట్లు తెలిసింది.


బాలికపై లైంగిక దాడి చేసింది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్‌కు చెందిన అటెండర్‌ను అని.. అతడిని అదుపులోకి తీసుకునేలా పోలీసులను ఆదేశించాలంటూ బాలల హక్కుల సంఘం సామాజికవేత్తలు కలెక్టర్‌ను కోరారు. దాడి ఘటనను దాచి పెట్టిన బాలల సంరక్షణ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పదేళ్ల అనాథ చిన్నారిపై లైంగిక దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఇంటర్ స్టూడెంట్ సూసైడ్..


ఇక హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన అనూష అనే స్టూడెంట్‌ను గతరాత్రే తల్లిదండ్రులు హాస్టల్‌లో వదిలి వెళ్లారు. ఇంతలోనే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లగా.. అనూష ఊరి వేసుకొని చనిపోయిందని తెలిపారు. వారు రాకముందే.. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


కాలేజీ సిబ్బంది వేధింపుల కారణంగానే తమ కుతూరు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది తనను వేధిస్తున్నారని పలుమార్లు తమకు చెప్పిందన్నారు. న్యాయం చేయాలంటూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com