ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్‌తో తెలంగాణ ఎంపీల సమావేశం అనంతరం రైల్ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందన్నారు.వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచినట్లు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లను ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. మరిన్ని రైళ్లను తీసుకువస్తామన్నారు.రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను చేస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అవి పూర్తవుతాయని తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు రూ.650 కోట్లు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు ఉన్నాయని, దీనిని యాదాద్రి వరకు విస్తరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తామన్నారు