తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలను కాపాడాలని కోరారు. ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తుచేశారు.లొసుగులు వాడుకొని పార్టీలన్నీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడింది రాజీవ్‌గాంధీ ఒక్కరేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, సుస్థిరంగా ఉందని చెప్పారు. అయితే, ఫిరాయింపుల వల్ల పార్టీ ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక హైకమాండ్‌కు లేఖ రాస్తున్నట్టు జీవన్‌రెడ్డి తెలిపారు