హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్, బీజేపీ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు మద్దతుగా బీజేపీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై స్పందించారు.తాను మరోసారి స్పష్టంగా చెబుతున్నానని... గతంలో అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఓఆర్ఆర్‌ను నిర్మించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మిస్తోందన్నారు.