మహిళాభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో.. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది కోసం డైనింగ్ హాల్, లేడీస్ లాంజ్, స్త్రీ క్యాంటీన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం.. వడ్డీ లేని రుణాలు భారీగా ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇస్తామని భట్టి విక్రమార్క వివరించారు.
మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు.. పలు వ్యాపారాల్లో రాణించేందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహకం అందించనుందని భట్టి హామీ ఇచ్చారు. టీజీఎస్ ఆర్టీసీలో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నామని వివరించారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి.. వారితోనే బస్సులు కొనుగోలు చేయించి.. వాటిని ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇప్పించి.. దాని ద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని వివరించారు.
మరోవైపు.. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొచ్చి మహిళలను భాగస్వాములు చేయాలని ప్రణాళికలు తయారు చేయిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు.. ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలోని మహిళలను ప్రజా ప్రభుత్వం మహాలక్ష్ములుగా భావిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించి.. అందుకు అవుతున్న రూ. 400 కోట్లను ప్రభుత్వం ప్రతి నెలా ప్రభుత్వం చెల్లిస్తోందని భట్టి పేర్కొన్నారు.
మరోవైపు.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయటమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను కూడా వారికే అప్పగించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదిక్కుకొని బలపడితే ఆ కుటుంబం బలపడుతుందని తమ ప్రభుత్వం భావిస్తోందని భట్టి విక్రమార్క్ చెప్పుకొచ్చారు.