హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ మండలం ప్రతాపసింగారంలో విషాదం చోటు చేసుకుంది. నమ్మిన స్నేహితులు మోసం చేయటంతో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కరెంట్ షాక్ పెట్టుకొని బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోగా.. కూతురు తృటిలో ప్రాణాలతో బయటపడింది. భర్త చావుబతుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన పగిడిమర్రి రామకృష్ణ(40) కార్పెంటర్. ఉప్పల్ చిలుకానగర్‌లో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. రామకృష్ణకు భార్య విజయలక్ష్మి, కుమారుడు సర్వేశ్, కుమార్తె వైష్ణవి ఉన్నారు.
రామకృష్ణ స్నేహితుడు మహేందర్‌చారి 2018లో ఓ ప్రైవేట్ చిట్ పంఢ్ కంపెనీలో ఓ చిట్ పాట పాడి రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఈ చిట్‌కు రామకృష్ణ గ్యారెంటీగా ఉన్నారు. దాంతో పాటుగా మహేందర్‌చారికి మరో రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఆ చిట్టి డబ్బులు కట్టకపోవటంతో చిట్ ఫండ్ కంపెనీ నిర్వహకులు గ్యారెంటీగా ఉన్న రామకృష్ణపై ఒత్తిడి తెచ్చారు. దానికి తోడు అతడికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలు కూడా ఇవ్వటం లేదు. ఇక మరో స్నేహితుడు గోవర్ధన్ రెడ్డికి సైతం రూ. రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అతడు కూడా అప్పు తిరిగి ఇవ్వటం లేదు. ఇక రామకృష్ణ బావమరిది శ్రీకాంత్‌చారి సైతం రూ.60వేలు ఇవ్వాలి.
అప్పు తీసుకున్న వారు సకాలంలో డబ్బులు ఇవ్వకపోగా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో రామకృష్ణ మానసిక ఆందోళనకు గురయ్యాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. శనివారం (అక్టోబర్ 26) ఉదయం కుమారుడు కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం స్కూల్ నుంచి కుమార్తె వైష్ణవి ఇంటికి వచ్చింది. అనంతరం అందరూ కలిసి చేతి మణికట్టుగా కాపర్ వైర్లు కట్టుకున్నారు. ఆ తర్వాత కరెంట్ ఫ్లగ్‌లో వైరు పెట్టారు. విద్యుత్ సరఫరా కావటంతో విజయలక్ష్మి స్పాట్‌లోనే చనిపోయింది. రామకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యాడు. కుమార్తె వైష్ణవి మాత్రం చివరి సెకన్‌లో వైర్ లాగేసి ప్రాణాలతో బయటపడింది.
అనంతరం కేకలు వేస్తూ పక్కింట్లో ఉండే వారికి విషయం చెప్పింది. వారు వచ్చే చూసే సరికి విజయలక్ష్మి ప్రాణాలు కోల్పోగా.. రామకృష్ణను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.