తెలంగాణలో ఆందోళనకారులను అణిచివేసే పోలీసులే గతకొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు ప్రధాన రహదారులు, సెక్రటేరియట్, ఎస్పీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సెలవుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఆ ఒక్క సమస్యే కాకుండా.. ఏఆర్, సివిల్ పోలీస్ విధానం రద్దు చేసి ఒకే రాష్ట్రం.. ఒకే పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనకు కారకులగా గుర్తిస్తూ.. పలువురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం (అక్టోబర్ 26) రాత్రి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్రమశిక్షణ కలిగిన శాఖలో పని చేస్తూ ఆందోళనలు చేపట్టటంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సెలవుల విషయంలో ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నా కానిస్టేబుళ్లు ఆందోళనకు కొనసాగిస్తున్నారని చెప్పారు. సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని డీజీపీ చెప్పినా.. ఆందోళనలు కొనసాగించడం ఏమాత్రం ఆక్షేపణీయం కాదన్నారు.
ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టినవారిని గుర్తించి వారిపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో మూడో బెటాలియన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, నాలుగులో ఆరుగురు, ఐదులో ఆరుగురు, ఆరులో ఐదుగురు, 12లో ఐదుగురు, 13లో ఐదుగురు, 17వ బెటాలియన్‌లో ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు చెప్పారు. మెుత్తంగా 31 మందిని సస్పెండ్ చేశామని.. అవసరమైతే మరింత కఠిన నిర్ణయం తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
పోలీసుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలో మొదటిసారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహిళా నేత సబితారెడ్డి అన్నారు. హోంశాఖ పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో హోంమంత్రి లేకపోవడం వల్ల కానిస్టేబుళ్లు తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదనన్నారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై గతంలో ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.